Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబైలో రూ.14.81 కోట్ల బంగారం పట్టివేత.. స్మగ్లర్ల ప్లాన్ మామూలుగా లేదు!

Mumbai gold seizure worth 1481 crore reveals unique smuggling plan by passengers
Advertisement
  • ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్మగ్లింగ్ భగ్నం
  • ఆహార పదార్థాలలో బంగారు పొడిని కలిపి అక్రమ రవాణా
  • రూ.14.81 కోట్ల విలువైన 9.40 కిలోల బంగారం స్వాధీనం
  • దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల అరెస్ట్
  • డీఆర్ఐ, కస్టమ్స్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో గుట్టురట్టు
Advertisement
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ బంగారం స్మగ్లింగ్‌ను అధికారులు భగ్నం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి సుమారు రూ.14.81 కోట్ల విలువైన 9.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొడిగా మార్చి, వాటిని ఆహార పదార్థాలలో కలిపి అత్యంత చాకచక్యంగా స్మగ్లింగ్ చేయాలని చూసిన వీరి పన్నాగాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ అధికారులు చిత్తుచేశారు.

వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 23న డీఆర్ఐ ముంబై జోనల్ యూనిట్, కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. దుబాయ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ముగ్గురు భారతీయ ప్రయాణికులపై అనుమానంతో వారిని అడ్డగించారు. వారి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయగా, ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులలో బంగారాన్ని దాచినట్లు గుర్తించారు.

బంగారాన్ని సన్నని పొడిగా మార్చి, దానిని పాలపొడి, ఓట్స్, వివిధ రకాల పిండి పదార్థాలు, కేక్ మిక్స్, కొబ్బరి పాల పొడి, నూటెల్లా, క్రీమ్ బాక్స్ వంటి ఆహార పదార్థాలలో కలిపారు. ఆహార పదార్థాల రంగు, ఆకృతికి సరిపోయేలా బంగారు పొడిని కలపడంతో గుర్తించడం కష్టంగా మారింది. అయితే, అనుమానం రావడంతో, నిశితంగా పరిశీలించిన అధికారులు వారి నుంచి సుమారు 33.50 కిలోల మిశ్రమ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఈ మిశ్రమాల నుంచి బంగారాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో జాగ్రత్తగా వేరు చేశారు. మొత్తం 9.40 కిలోల 24 క్యారెట్ల (99.99% స్వచ్ఛత) విదేశీ బంగారం లభించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీని మార్కెట్ విలువ రూ.14.81 కోట్లు ఉంటుందని, ఈ స్మగ్లింగ్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.5.9 కోట్ల మేర పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.

అధికారుల విచారణలో నిందితులు తాము ఒక వ్యవస్థీకృత స్మగ్లింగ్ ముఠా కోసం క్యారియర్లుగా పనిచేస్తున్నట్లు అంగీకరించారు. వారిని కస్టమ్స్ చట్టం, 1962 కింద అరెస్ట్ చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ పద్ధతి అత్యంత అధునాతనమైనదని, దీని వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement
Mumbai International Airport
Gold Smuggling
DRI Mumbai
Gold Seizure
Dubai Mumbai Gold
Customs Air Intelligence Unit

More Telugu News